: నేనేం అల్లాటప్పా వ్యక్తిని కాదుగా... మరి ఫ్లెక్సీల్లో నా ఫొటో ఏదీ?: అధికారులపై నాయిని ఫైర్!
హైదరాబాదులోని తెలుగు యూనివర్సిటీలో నిన్న జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంధించిన ప్రశ్నలతో అధికారులు ఉర్కిరిబిక్కిరయ్యారు. కారు దిగీదిగగానే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ఆయన ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సమావేశానికి రాని ఆర్థిక శాఖ మంత్రి ఫొటో ఫ్లెక్సీల్లో కనిపిస్తోందని, సమావేశానికి హాజరైన తన ఫొటో ఎక్కడ? అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆహ్వాన పత్రికపైనా తన పేరు ఎందుకు రాయలేదంటూ నిలదీశారు.
‘‘బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఈటెల రాజేందర్ ఫొటో ఎందుకు పెట్టారు? ఆయన మీటింగ్ కు రాలేదే. నేను సీనియర్ నాయకుడిని. అంతేకాక హోంశాఖ మంత్రిగా ఉన్నాను. అయినా నా ఫొటో పెట్టరా?’’ అంటూ ప్రశ్నించిన నాయినికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు అయోమయంలో పడిపోయారు. ‘‘ఫ్లెక్సీల్లో నా ఫొటో కనిపించడం లేదు. ఆహ్వాన పత్రంపై నా పేరు ముద్రించలేదు. నేను హోం శాఖ మంత్రిని. అల్లాటప్పా వ్యక్తిని కాదు’’ అని ఆయన ఊగిపోయారు.