: జీతంగా కోట్లేమీ వద్దు, ప్రభుత్వ వేతనం చాలు: బ్యాంకుల కొత్త బాస్ లు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎండీలుగా తమను ఎంచుకోవడమే ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, వేతనంగా కోట్ల రూపాయలేమీ వద్దని, ప్రభుత్వ స్కేల్ ప్రకారం ఇస్తే చాలని చెప్పారు ఆ ఉద్యోగులు. ప్రస్తుతం వాల్యూ హోమ్స్ ఎండీగా ఉన్న జయకుమార్ ను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ అండ్ సీఈఓగా, లక్ష్మీ విలాస్ బ్యాంకు ఎండీగా ఉన్న రాకేష్ శర్మను కెనరా బ్యాంకు ఎండీ అండ్ సీఈఓగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లోని బాస్ లకు కోట్ల రూపాయల్లో వేతనాలుంటే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది లక్షల్లోనే ఉంది. వీరికి సంవత్సరానికి రూ. 24 లక్షల వేతనం ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఓ ప్రభుత్వ సంస్థకు సేవ చేయడమే తమకు ముఖ్యమని ప్యాకేజీ ఎంతన్నది పెద్ద విషయం కాదని ఈ సందర్భంగా వీరిరువురూ స్పష్టం చేశారట. కాగా, శర్మకు లక్ష్మీ విలాస్ బ్యాంకులో సాలీనా రూ. 80 లక్షలు వేతనంగా లభించేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ బాస్ గా ఉన్న అరుంధతి భట్టాచార్యకు రూ. 23.77 లక్షల వేతనం లభిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ ఎస్ఎస్ ముంద్రాకు రూ. 25.12 లక్షల వేతనం లభిస్తోంది. ఇక ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చంద కొచ్చర్ కు రూ. 5.83 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఆదిత్య పూరీకి రూ. 7.39 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో శిఖా శర్మకు రూ. 4.17 కోట్ల వేతనం లభిస్తోంది.

More Telugu News