: కడియం శ్రీహరికి మంత్రి పదవి నేను పెట్టిన భిక్షే!: ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి మంత్రి పదవి తాను పెట్టిన భిక్షే అంటూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేసిన ఒకరోజు దీక్షలో ఆయన మాట్లాడుతూ, తాను వద్దన్న పదవిలోనే కడియం కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అవకాశవాదంతో పార్టీలు మారే కడియం శ్రీహరి తనకు పోటీ కాదని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించి మంత్రి పదవి ఆఫర్ చేశారని, దానిని తిరస్కరించానని ఆయన చెప్పారు. ఒకవేళ దయాకర్ మంత్రి కావాలనుకుంటే అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో కూడా తన వల్లే కడియం రెండు సార్లు మంత్రి అయ్యారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ అంటే భయం అని ఎర్రబెల్లి తెలిపారు. అందుకే మంత్రి పదవులు ఎరగా వేసి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కు చేతనైతే తన పార్టీకి చెందిన వారికే పదవులు ఇచ్చి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తే, కేసీఆర్ బలమైన నాయకుడని ఒప్పుకుంటామని సవాలు విసిరారు. టీడీపీ అంటే ఉన్న భయం వల్లే, తమ పార్టీ నేతలను జైలుకు పంపి వేధిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

More Telugu News