: శ్రీవారి వద్ద ఉన్న బంగారం ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు సందర్శించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వద్ద 4.5 టన్నుల బంగారం నిల్వలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీవారికి చెందిన 4.5 టన్నుల బంగారం వివిధ బ్యాంకుల్లో ఉంది. మరో టన్ను బంగారాన్ని త్వరలోనే డిపాజిట్ చేయాలని టీటీడీ భావిస్తోంది. కాగా, వాస్తవానికి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న బంగారం భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించిన ఆభరణాలకు సంబంధించినది. ఇక స్వామివారి ఏడువారాల ఆభరణాలు, శ్రీ కృష్ణదేవరాయలు, ఇతర రాజులు సమర్పించిన ఆభరణాలు, బొక్కసంలో రోజువారీ వాడకానికి వినియోగించేవి, బ్రహ్మోత్సవాల్లో వాడే ఆభరణాలు, టీటీడీ అనుబంధ దేవాలయాల్లోని దేవుళ్ల వద్ద ఉన్న బంగారం దీనికి అదనం. బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడాన్ని 2010లో ప్రారంభించిన టీటీడీ, ఆపై 2011లో, 2014లో స్వామివారికి కానుకలుగా వచ్చిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.