: కాషాయ రంగును పులుముకున్న పాతబస్తీ
హైదరాబాదులోని పాతబస్తీ కాషాయ రంగును పులుముకుంది. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు దాదాపు 200కు పైగా చిన్న, పెద్ద ఆలయాల్లో నేడు బోనాల పండగ జరగనుండటంతో, వీధులన్నీ కాషాయం జెండాలతో రెపరెపలాడుతున్నాయి. లాల్ దర్వాజాలో తెల్లవారుఝాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాదాపు మూడువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ అక్కన్న మాదన్న దేవాలయం సహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు నేడు వైభవంగా మొదలయ్యాయి. రేపు జరిగే రంగం, ఆపై అంబారీ ఊరేగింపుతో బోనాల వేడుకలు ముగుస్తాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.