: ఇందుకేనా తెలంగాణ ఇచ్చింది?... ఇక యుద్ధానికి కదలండి: ఓయూ విద్యార్థులతో సోనియా
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను నిరంకుశంగా పాలిస్తోందని, విద్యార్థులు మరో యుద్ధానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ పీసీసీ నేతల ఆధ్వర్యంలో తనను కలిసిన ఉస్మానియా విద్యార్థులతో సోనియా పావుగంట పాటు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని, ఏ పని కావాలన్నా కోర్టు గడప తొక్కక తప్పడం లేదని విద్యార్థులు వివరించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులను వాడుకుని, ఇప్పుడు వదిలేశారని, ఏవైనా సమస్యల గురించి చర్చిద్దామంటే, అపాయింట్ మెంటు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. తెలంగాణలో నలుగురి పాలన నడుస్తోందని, దీనికి చరమగీతం పాడాలని కోరారు. దీనిపై స్పందించిన సోనియా, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే, కేసీఆర్ దాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు సూచించారు. మరో తెలంగాణ ఉద్యమం రావాల్సిన అవసరముందని, దాని వెనుక తాము అండగా నిలుస్తామని తెలిపారు.