: ఐరాస ఉపగ్రహానికి అబ్దుల్ కలాం పేరు

భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత సైంటిస్టు దివంగత అబ్దుల్ కలాంకు నివాళిగా ఓ ఉపగ్రహానికి ఆయన పేరును పెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఎర్త్ అబ్జర్వేషన్-డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (భూపరిశీలన-విపత్తు ముప్పు తగ్గింపు) ప్రయోజనాల నిమిత్తం రూపొందించిన గ్లోబల్ శాట్ కు కలాం పేరు పెడుతున్నట్టు ఈ ప్రాజెక్టులో ఐరాసతో కలిసి పనిచేస్తున్న సీఏఎన్ఈయూఎస్ సంస్థ చైర్మన్ మిలింద్ పింప్రికర్ తెలిపారు. విపత్తు నిర్వహణకు ఉపయోగపడే స్పేస్ టెక్నాలజీ సొల్యూషన్స్ కోసం ఓ ఉమ్మడి వేదిక ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటైందే సీఏఎన్ఈయూఎస్. కాగా, పింప్రికర్ మాట్లాడుతూ... విపత్తు ముప్పు తగ్గింపు కోసం ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరితో పంచుకోవాలన్నదే ఐరాస ఉద్దేశమని పేర్కొన్నారు. గ్లోబల్ శాటిలైట్ కు కలాం పేరు పెట్టాలన్న నిర్ణయం వెనుక ఉద్దేశాలను ఆయన వివరించారు. కలాం లక్ష్యాలకు అనుగుణంగానే ఈ గ్లోబల్ శాటిలైట్ కూడా ఉంటుందని, అంతరిక్ష పరిశోధన రంగంలో ముందువరుసలో ఉన్న దేశాలు చేతులు కలపాలని, మానవాళిని నష్టపరుస్తున్న విపత్తులను ఎదుర్కోనేందుకు తగిన మార్గాలు కనుగొనాలని ఆయన తన 'వరల్డ్ స్పేస్ విజన్-2050'లో ఆకాంక్షించారని తెలిపారు. అందుకే ఈ ఉపగ్రహానికి యూఎన్ కలామ్ గ్లోబ్ శాట్ అని పునఃనామకరణం చేస్తున్నట్టు పింప్రికర్ చెప్పారు.

More Telugu News