: 'ఆప్' తరహాలో 'జాప్'... కొత్త పార్టీ పెట్టనున్న కోదండరాం!
తెలంగాణలో జేఏసీ నేత కోదండరాం ఆధ్వర్యంలో కొత్త పార్టీ వేళ్లూనుకోనుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో తెలంగాణలో జాయింట్ యాక్షన్ పార్టీ (జాప్) పేరిట ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసి, భావ సారూప్య శక్తులను ఏకం చేసి సంపూర్ణ తెలంగాణ కోసం కృషి చేయాలని కోదండరాం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆప్ మాజీ నేత యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భావం కానుందని, ఆయన కోదండరాంతో కలసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు 10వ తేదీన ఇద్దరి మధ్యా కీలక సమావేశం జరగనుందని, ఆ సమావేశం తరువాత కొత్త పార్టీపై మరిన్ని విషయాలు తెలుస్తాయని సమాచారం. కాగా, గతంలోనే ఆప్ కు ఆంధ్రప్రదేశ్ లో కన్వీనర్ గా ఉండాలని కోదండరాంకు యోగేంద్ర ఆఫర్ ఇస్తే, దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. "ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నా. రేపు ఏమి అవుతానో చెప్పలేను, ‘సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తాం" అంటూ ఇటీవల కోదండరాం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.