: అనుకున్న సమయానికి పని పూర్తి కావడం లేదా? ఈ సలహాలు పాటించి చూడండి!


ఏదైనా ఒక పనిని తలపెట్టాక, అనుకోని కారణాలు లేదా చేస్తున్న పనిలో అశ్రద్ధ చూపడం ద్వారా, దాన్ని పూర్తి చేయకుండా వదిలేసే సందర్భాలు అనేకం ఉంటాయి. పని మధ్యలో ఇంకో పనిలో నిమగ్నం కావడమే ప్రధాన సమస్య. ఇది చాలా మంది ఉద్యోగులకు ఎదురవుతుంది. అయితే, ఇటీవలి కాలంలో, ఓ పని ఆలస్యం కావడానికి అసలు కారణం సెల్ ఫోన్ అని, ఆపై ఇంటర్నెట్ చూడటం, పక్కవాళ్లతో బాతాఖానీలు పెట్టుకోవడం వల్ల పని ఆలస్యం అవుతోందని ఇటీవల ఓ సంస్థ 5 వేల మందిని భాగం చేస్తూ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఈ సలహాలు పాటించి చూడండి. సమయాన్ని ముందుకు జరుపుకోవాలి: ఒక పనిని మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తి చేయాలని అనుకున్నారనుకోండి. దాన్ని ఓ అరగంట ముందుకు జరుపుకోవాలి. దీనివల్ల సమయం తరుముకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏవైనా అవాంతరాలు వచ్చినా అరగంట గ్రేస్ సమయం మిగులుతుంది. సెల్ ఫోన్ ను మరచిపోవాలి: సాధ్యమైనంత వరకూ ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడకుంటేనే మేలు. వచ్చే అన్ని మెసేజ్ లు చూడటం, అన్ని కాల్స్ కూ అటెండ్ కావడాన్ని మరచిపోవాలి. ఇందుకోసం అత్యవసరమైతేనే సెల్ ఫోన్ ను తాకాలన్న నియమం పెట్టుకోవాలి. ఏకాగ్రత ఎంతో ముఖ్యం: ఎంత కాన్సన్ ట్రేషన్ తో పనిచేస్తున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. చాలా సార్లు సహోద్యోగులు వచ్చి మాట్లాడుతుంటారు. వారిని పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. దీన్ని అధిగమించాలంటే, మీరు బిజీగా ఉన్నారన్న విషయం వారికి తెలిసేలా వ్యవహరించాలి. వారి మాటలు వింటున్నట్టు నటిస్తూ, పనితో ముడిపడ్డ విషయాలు చర్చించాలి. అలా చేస్తే మరోసారి వారు డిస్టర్బ్ చేసేందుకు జంకుతారు. ఈ-మెయిల్స్ కూ సమయం: ఈ-మెయిల్ ఖాతాకు వస్తున్న మెయిల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఏమేం మెయిల్స్ వచ్చాయో చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా ముఖ్యమైనవని అనిపించినవి ఓపెన్ చేసి, తరువాత తీరికగా మిగిలినవి చూసుకోవచ్చు. ఈ సూచనలు పాటిస్తే, మీరనుకున్న పని, అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసే సౌలభ్యం లభిస్తుంది.

  • Loading...

More Telugu News