: ఇన్ఫోసిస్ లో అన్నీ జీన్స్, టీ షర్ట్సే!... విశాల్ సిక్కా ఎంట్రీతో మారిన కల్చర్
నిన్నటిదాకా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఉద్యోగులంతా ప్యాంటు, షర్ట్, టై... చక్కగా ఇన్ షర్ట్ చేసి మరీ కనిపించేవారు. ఇప్పుడేమో ఎవరిని చూసినా... జీన్ ప్యాంట్, టీ షర్ట్ లో చలాకీగా కనిపిస్తున్నారు. ఇందుకు మహిళా ఉద్యోగులు కూడా మినహాయింపేమీ కాదు. కంపెనీ ఎండీగా విశాల్ సిక్కా ఎంట్రీతోనే ఈ మార్పు వచ్చిందట. అదేంటీ, విశాల్ సిక్కా ఎంట్రీ ఇచ్చి ఏడాదేగా అయింది అనేగా మీ ప్రశ్న. కరెక్టే, సిక్కా ఎంట్రీ ఇచ్చి ఏడాదే అయినా, ఒక్క డ్రెస్సింగేనా? అన్ని విషయాల్లోనూ ఇన్ఫోసిస్ లో మార్పులొచ్చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్ఫోసిస్ కల్చరే పూర్తి స్థాయిలో మారిపోయింది.
మహిళా ఉద్యోగి తన ప్రసూతి సెలవును పొడిగించుకోవాలంటే కంపెనీ వద్దకు రావాల్సిన పనిలేదట. కేవలం సంబంధిత విభాగం మేనేజర్ కు మెయిల్ పెడితే సరిపోతుంది. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారితో పాటు స్పౌజ్ కేసుల్లోనూ బదిలీ కావాలంటే క్షణాల్లో పని పూర్తవుతోందట. ఇక ఉద్యోగుల కోసం కంపెనీ వినూత్న కార్యక్రమాలనూ క్రమం తప్పకుండా చేపడుతోంది. అంటే, సిక్కా ఎంట్రీతో ఇన్ఫోసిస్ రూపురేఖలే మారిపోయాయన్నమాట.