: ప్రమాదకర స్థాయిలో కరుగుతున్న హిమనీ నదాలు... అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి
హిమనీ నదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించింది. ఈ శతాబ్దంలోని తొలి దశాబ్దంలో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా హిమనీ నదాలు కరుగుతున్నట్టు స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యురిచ్ కేంద్రంగా పనిచేసే 'వరల్డ్ గ్లేసియర్ మానిటోరింగ్ సర్వీస్' (డబ్ల్యూజీఎమ్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీ నదాల్లో సంభవించిన మార్పులకు సంబంధించి సుమారు 120 ఏళ్లకు పైగా సమాచారాన్ని ఈ సంస్థ సేకరించింది. శాటిలైట్ ఆధారిత డేటాతో పాటు వివిధ రకాలుగా సమాచారాన్ని తీసుకుంది.
అధ్యయనం వెల్లడించిన కొన్ని వివరాలు చూస్తే.. ఏడాదికి అర మీటరు నుంచి మీటరు వరకు హిమనీ నదాలు కరుగుతున్నాయని, గత శతాబ్దంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంగా ఉందని డబ్ల్యూజీఎమ్ఎస్ డైరెక్టర్ మైకెల్ జెంప్ తెలిపారు. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల హిమనీ నదాలకు వర్తిస్తాయన్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో హిమనీ నదాలు కరిగిన దాఖలాలు లేవని, అధిక స్థాయిలో కుంచించుకుపోతున్నాయని నివేదిక పేర్కొంది. భారీగా కరుగుతుండటం వల్ల నదాల్లో అసమతౌల్యత ఏర్పడిందని వివరించింది.