: శ్రీవారికి ఉచిత సేవ తమ వల్ల కాదంటున్న బ్యాంకర్లు
తిరుమలలో వివిధ రకాల సేవలను ఉచితంగా అందిస్తున్న పలు బ్యాంకులు, ఇకపై ఉచిత సేవలు చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ టోకెన్లు, వివిధ రకాల టికెట్లు విక్రయిస్తున్న బ్యాంకర్లకు నెలవారీ ఖర్చులు రూ. 1కోటి దాటుతుండటంతో, ఈ ఆర్థిక భారాన్ని భరించలేమంటూ వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీటీడీ ఈఓ సాంబశివరావుకు స్పష్టం చేశారు. భక్తులకు సేవలందించేందుకు వివిధ బ్యాంకులు తిరుమలలో తమ శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. బ్యాంకుల నిర్వహణ, సిబ్బంది వేతనాలు, రవాణా ఖర్చులు తదితరాలకు నెలకు కోటి నుంచి కోటిన్నర రూపాయలు వ్యయమవుతోంది. బ్యాంకుల ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ సైతం ఆయా బ్యాంకుల్లో భారీఎత్తున డిపాజిట్లు చేస్తూ వస్తోంది.
అయితే, బ్యాంకర్లు నియమించుకుంటున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే తలనొప్పులు వస్తున్నాయి. వీరు లడ్డూలను, టోకెన్లను బ్లాక్ లో విక్రయించడం, సేవా టికెట్ల అక్రమాలు తదితరాల్లో తరచూ దొరికిపోతున్నారు. దీంతో టీటీడీ నుంచి బ్యాంకర్లపైనా ఒత్తిడి పెరుగుతుతోంది. అందువల్లే అన్ని బ్యాంకులూ మూకుమ్మడిగా ఉచిత సేవ చేయలేమని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, వీరు తామందిస్తున్న సేవలు ఆపేస్తే, వాటన్నింటినీ టీటీడీ స్వయంగా నిర్వహించుకోవాలి. అందుకు ఏటా రూ. 10 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఈ భారాన్ని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా టీటీడీ యోచిస్తోంది.