: పాకిస్థాన్ లో యువకుడికి ఉరిశిక్ష అమలు

సరిహద్దు దేశం పాకిస్థాన్ లోని కరాచీ సెంట్రల్ జైలులో ఈ రోజు షఫ్ ఖత్ అనే యువకుడిని ఉరితీశారు. 2004లో ఏడు సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఇతనికి ఉరిశిక్ష అమలు చేశారు. జనవరి 14నే ఉరితీయాలనుకున్నప్పటికీ నాలుగు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో నేరం రుజువై ఉరిశిక్ష విధించినప్పటికీ అతని వయసును కారణంగా చూపి న్యాయవాదులు చిక్కులు సృష్టించారు. నేరం చేసే సమయానికి అతని వయసు 14 ఏళ్లేనని వాదించారు. ఈ నేపథ్యంలో పాక్ జువెనైల్ జస్టిస్ వ్యవస్థ ప్రకారం 18 సంవత్సరాలలోపు వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయరు. దాంతో మళ్లీ ప్రత్యేక దర్యాప్తు చేయడంతో నేరం చేసే నాటికి యవకుడి వయసు 23 ఏళ్లని తేలింది. మళ్లీ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. కానీ అత్యున్నత న్యాయస్థానం వయసు అభ్యంతరాలను పక్కనపెట్టింది. అదే సమయంలో పెషావర్ పాఠశాలలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఉరిశిక్షల అమలుపై ప్రభుత్వం అప్పుడే నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో షఫ్ ఖత్ ఉరి అమలుకు న్యాయపరంగా అడ్డంకులు తొలగిపోయాయి.

More Telugu News