: పుత్తడి కోసం పరుగులు పెట్టొద్దు...జస్ట్ వెయిట్!
బంగారం ధరలు ఐదేళ్ల కనిష్ఠ స్థాయులకు చేరినప్పటికీ, నూతన కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరలు మరింతగా పతనమయ్యే అవకాశాలు ఉన్నందున ఇంకొంత కాలం వేచి చూడాలన్నది వారిస్తున్న సలహా. బంగారం ధరలు ఇంతకన్నా పడిపోదులే అని భావించే సమయం ఇంకా రాలేదన్నది నిపుణుల అంచనా. ఇంటర్నేషనల్ మార్కెట్లో జూలై 22న బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు (31.1 గ్రాములు) 1,090 డాలర్లకు పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్ఠస్థాయి. సెప్టెంబర్ 2011లో ఆల్ టైం రికార్డు ధర 1,900 డాలర్లతో పోలిస్తే ఇది 42 శాతం తక్కువ. ఈ ధర కన్నా ఎక్కువ పతనం నమోదు కాదన్న అంచనాలతో ఆ మరుసటి రోజు భారీగా కొనుగోళ్లు జరగడంతో బంగారం ధర పెరిగింది. అయితే, ఇది తాత్కాలికమే అయింది. జూలై 22తో పోలిస్తే నెలాఖరుకు 8 శాతం వరకూ ధరలు పడిపోయాయి.
ప్రస్తుతం 1080 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధరలు 990 డాలర్ల కన్నా దిగువకు రాకపోవచ్చని జియోజిత్ కాంట్రేడ్ డైరెక్టర్ సీపీ కృష్ణన్ అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి 990 డాలర్ల నుంచి 1,040 డాలర్ల మధ్య కొనుగోలు మద్దతు రావచ్చని అన్నారు. గనుల నుంచి ఔన్సు బంగారం వెలికితీయడానికి 1000 డాలర్లు ఖర్చవుతున్నందున అంతకుమించి ధరలు పడిపోకపోవచ్చని వివరించారు. అందువల్ల ఔన్సు బంగారం ధర మరో 40 డాలర్ల వరకూ తగ్గిన తరువాత కొనుగోళ్లు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.
ప్రస్తుతం బులియన్ బుల్ ఆపరేటర్లందరూ నష్టాల్లో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరగడం ప్రారంభమైతే 1,130 డాలర్ల నుంచి 1,140 డాలర్ల మధ్య నష్టాలను పూడ్చుకునేందుకు ఈ ట్రేడర్లు యత్నిస్తారని, దాని వల్ల మరోసారి ధరలు దిగివస్తాయని అంచనా. మరోవైపు వెండి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఏప్రిల్ 2011 ఆల్ టైం రికార్డు ధర ఔన్సుకు 48.6 డాలర్లతో పోలిస్తే, ఇప్పుడు 70 శాతం తక్కువ ధరకు వెండి లభిస్తోంది.