: రేవంత్ కు ఎదురు దెబ్బ... బెయిల్ షరతుల సడలింపునకు ఏసీబీ కోర్టు నో!

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి మరోమారు ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ షరతులను సడలించాలన్న రేవంత్ పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. కొడంగల్ కే పరిమితం కావాలన్న షరతుతో రేవంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఆ షరతును సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. అయితే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి వాదనను తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉంటే, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందన్న ఏసీబీ వాదనకే మొగ్గుచూపిన హైకోర్టు రేవంత్ రెడ్డి వినతిని తోసిపుచ్చింది. తాజాగా ఈ విషయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కూడా రేవంత్ రెడ్డికి ప్రతికూలంగానే స్పందించింది. దీంతో మరికొంతకాలం పాటు రేవంత్ రెడ్డి కొడంగల్ కే పరిమితం కాక తప్పని పరిస్థితి నెలకొంది.

More Telugu News