: మరోసారి తళుక్కుమన్న నల్లారి... ‘వాకింగ్’ మిత్రుడి జన్మదిన వేడుకలకు హాజరు
ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా రికార్డులకెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవి నుంచి దిగిపోయిన తర్వాత మరీ నల్లపూసైపోయారు. గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు కనిపించకుండాపోయారు. అప్పుడెప్పుడో కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిపై కాల్పుల సందర్భంగా ఓ సారి తళుక్కుమన్నారు. ఆ తర్వాత మొన్న దక్షిణాది విడిది కోసం హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు రెండోసారి బయటకు వచ్చారు.
తాజాగా నిన్న మూడోసారి ముచ్చటగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాదులోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ లో జరిగిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కేవీ రంగయ్య 87వ జన్మదిన వేడుకలకు కిరణ్ హాజరయ్యారు. అసలు కేవీ రంగయ్యతో ఈయనకు ఎక్కడ పరిచయమో తెలుసా?... గతంలో వాకింగ్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి నిత్యం కేబీఆర్ పార్కుకు వచ్చేవారన్న విషయం తెలిసిందేగా. ఆ క్రమంలోనే కేవీ రంగయ్యతో ఆయనకు పరిచయమైందట. ఈ విషయాన్ని నిన్నటి కార్యక్రమంలో స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డే వెల్లడించారు.