: అమ్మ దర్శనం కోసం తరలివచ్చిన నేతలు
ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వీఐపీలు పోటెత్తారు. గత రాత్రి టర్కీ బయలుదేరి వెళ్లే ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మవారిని దర్శనం చేసుకోగా, ఈ ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అమ్మ దర్శనం కోసం వెల్లువెత్తారు. తొలుత టీఎస్-మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లారు. ఆ తరువాత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత గీతా రెడ్డి తదితరులు రాగా, కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రసమయి బాలకిషన్, కేశవరావు తదితరులు ఆలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి అమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు అవస్థలు తెచ్చి పెట్టాయి. రెండు రోజుల బోనాల ఉత్సవాల్లో భాగంగా 12 లక్షల మందికి పైగా భక్తులు ఆలయానికి రావచ్చని అంచనా.