: గన్నవరం ఎయిర్ పోర్టులో 'గద్దల గోల'!
త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనున్న విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో తిరుగాడుతున్న గద్దలు అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. గడచిన వారం రోజుల వ్యవధిలో గాల్లోకి ఎగిరిన మూడు విమానాలు గద్దల కారణంగా వెనుతిరిగి రావాల్సి వచ్చింది. గద్దలు తగిలితే విమానాలకు పెను ప్రమాదం జరుగుతుంది. వేగంగా గాల్లోకి ఎగిరే విమానాన్ని గద్దలు ఢీకొంటే, ఇంజనులో మంటలు చెలరేగి గాల్లోనే విమానాలు మండిపోతాయి. దీంతో గద్దలను తరిమికొట్టేందుకు గన్నవరం విమానాశ్రయ అధికారులు నానా తంటాలూ పడుతున్నారు. గత వారంలో ఎయిర్ కోస్తా విమానం రెండు సార్లు, స్పైస్ జెట్ విమానం ఒకసారి గద్దల భయంతో టేకాఫ్ అయిన వెంటనే తిరిగొచ్చాయి.
ఆ ప్రాంతంలో పొలాలు ఎక్కువగా ఉండటం, మాంసం దుకాణాలు ఉండటం కారణంగానే ఆహార అవసరాలు తీర్చుకునేందుకు గద్దలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని తరిమికొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో రన్ వే పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ కోస్తా విమానం ఎక్కిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గద్దల గోల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాను ప్రయాణిస్తున్న విమానం ప్రొపెల్లర్ కు గద్ద తగిలిందని, వెంటనే ల్యాండింగ్ చేసిన పైలట్ 'వుయ్ ఆర్ లక్కీ' అన్నాడని, అసలు విషయం తెలుసుకున్న తాను ఎంతో షాక్ నకు గురయ్యానని అన్నారు. గద్దల తరిమివేతకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు వివరించారు.