: కొడుకు చేతికి కత్తినిచ్చి తల్లిని నరకమన్న ఐఎస్ఐఎస్!
ఐఎస్ఐఎస్ దురాగతాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా, నాలుగేళ్ల బాలుడికి ఓ కత్తిని ఇచ్చి "దీంతో నీ తల్లి తల నరకాలి" అని ఉగ్రవాదులు ఆదేశించారు. ఈ విషయాన్ని ఐఎస్ చెర నుంచి పారిపోయి వచ్చిన యాజిడి వర్గం మహిళ ఒకరు తెలిపారు. తన కుమారుడిని బలవంతంగా తన నుంచి వేరు చేసి ఉగ్రవాద క్యాంపులో చేర్చారని, తనపై 'మత విశ్వాసాలు నమ్మదు' అని ముద్రవేసి తన కుమారుడి చేతికి కత్తిని ఇచ్చారని 'మెయిల్ ఆన్ లైన్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తన కుమారుడికి శిక్షణలో భాగంగా ఖురాన్ చదవడం, షరియా చట్టాలు, అరబిక్ భాషలో మాట్లాడటం, కత్తుల వాడకం... వంటి విషయాలను బోధిస్తున్నారని అన్నారు. ఆగస్టు 2014లో తనతో పాటు తన నలుగురు పిలల్లను ఉగ్రవాదులు అపహరించారని ఆమె తెలిపారు. 14 సంవత్సరాల తన కుమార్తెను ఓ ఉగ్రవాదికి విక్రయించారని వాపోయారు. మిగతా ముగ్గురినీ ఉగ్రవాద శిక్షణా కేంద్రంలో చేర్చారని, తాను బందీగా ఉన్న సమయంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం మత్తులో ఉంచేవారని, అందుకోసం మార్ఫిన్ ను ఆహారంలో కలిపి ఇచ్చారని తెలిపారు.