: కిడ్నాపింగులో మెక్సికో తర్వాత మనమే!
భారత్ లో పౌరుల భద్రత ఏ స్థాయిలో ఉందో 'కంట్రోల్ రిస్క్' సంస్థ నివేదిక చూస్తే అర్థమవుతుంది. కిడ్నాపింగ్ ఘటనల పరంగా భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో ఉందని ఈ యూకే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో మెక్సికో అగ్రస్థానం అలంకరించింది. ఇక, భారత్ తర్వాత పాకిస్థాన్, ఇరాక్, నైజీరియా, లిబియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, సూడాన్, లెబనాన్ ఉన్నాయి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలు భారత్ తర్వాతి స్థానంలో ఉన్నాయి కదా అని అక్కడ కిడ్నాపులు తక్కువగా చోటుచేసుకుంటున్నాయని భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, భారత్ లో కిడ్నాపులపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, అదే సమయంలో పొరుగుదేశాల్లో కిడ్నాప్ వ్యవహారాలు చాలా వరకు వెలుగులోకి రావడంలేదని కంట్రోల్ రిస్క్ నివేదిక చెబుతోంది. మెక్సికో, వెనిజులా, హైతీ, నైజీరియా వంటి దేశాల్లో కిడ్నాప్ అండ్ రాన్సమ్ (కే అండ్ ఆర్) ఇన్సూరెన్స్ విధానం అమల్లో ఉంది. ఆయా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు, వ్యక్తులకు ముప్పు ఎక్కువగా ఉన్నందున ఈ తరహాలో బీమా సౌకర్యం అమలు చేస్తారు. తాజాగా, భారత్ తదితర దేశాల్లోనూ ఇలాంటి బీమా పాలసీలను ప్రవేశపెట్టాలని వరల్డ్ ఇన్స్యూరెన్స్ సంస్థలకు 'కంట్రోల్ రిస్క్' సూచించింది.