: కాంగ్రెస్ పై వెంకయ్య మండిపాటు... వారు తీసుకొచ్చిన బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారని విమర్శ
పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగనివ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఇలా చేయడం గొప్పకాదని, దేశానికి నష్టం కలిగించడమే అవుతుందన్నారు. అసలు విషయం ఇదైతే, ప్రభుత్వమే సమావేశాలు జరగనివ్వకుండా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించడం దారుణమన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్లాలని తాము భావిస్తుంటే వారు ప్రభుత్వానికి సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇక వారి హయాంలో పార్లమెంటుకు తెచ్చిన బిల్లులనే ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. ఇదంతా ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని వెంకయ్య మండిపడ్డారు. జీఎస్ టీ బిల్లు లోక్ సభలో ఏకగ్రీవ ఆమోదం పొందిందని చెప్పిన ఆయన, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఆ బిల్లు ఆమోదం పొందితే దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. జీఎస్ టీ, భూసేకరణ బిల్లులు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమన్నారు. ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
రామేశ్వరంలో నిన్న(గురువారం) జరిగిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు వేలమంది తరలివచ్చారని వెంకయ్య అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా ఎక్కడెక్కడి నుంచో అనేకమంది వచ్చారని, ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందణి అన్నారు. తాను, కేంద్ర రక్షణ మంత్రి పారికర్ అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షించామని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు.