: మెదక్ జిల్లా వరకు వచ్చిన నీరు రంగారెడ్డి జిల్లాకు ఎందుకు రావడం లేదు?: సబిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి సబిత మండిపడ్డారు. ఈరోజు శంకర్ పల్లి మండలం మహాలింగాపూర్ లో చేవెళ్ల-ప్రాణహిత పనులను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలంటూ డిమాండ్ చేసిన కేసీఆర్... మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసిన వెంటనే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. డిజైన్ మార్చి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకోవడం కేసీఆర్ అవివేకమని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా వరకు వచ్చిన నీరు రంగారెడ్డి జిల్లాకు రావడం లేదని... రంగారెడ్డికి గోదావరి జలాలు కూడా రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.