: పూణేలో రాహుల్ గాంధీ... ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు మద్దతు
టీవీ నటుడు గజేంద్ర సింగ్ చౌహాన్ ను పుణేలోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ టీఐఐ)కు చైర్మన్ గా నియమించడం పట్ల విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ విషయంలో ఎఫ్ టీఐఐ విద్యార్థులకు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుణే విచ్చేసి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులను కలుసుకున్నారు. చౌహాన్ ను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆయన తన మద్దతు తెలిపారు. విద్యార్థులు రాహుల్ తో మాట్లాడుతూ... ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని కోరారు. వారి కోరిక పట్ల రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. పార్లమెంటులో ఈ అంశాన్ని తప్పక లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. కాగా, తమ డిమాండ్ కు మద్దతివ్వాల్సిందిగా విద్యార్థులు రాహుల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.