: హీరోయిన్ ను చేస్తామని తీసుకొచ్చి...!
ఎక్కడో పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఓ యువతిని హీరోయిన్ ను చేస్తామని నమ్మబలికి హైదరాబాదుకు తీసుకువచ్చిన ఇద్దరు దుర్మార్గులు ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలో దింపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హనుమాన్ నాయక్, లక్ష్మణ్ అనే యువకులు తాము దర్శక నిర్మాతలమని ప్రచారం చేసుకుని నెల రోజుల క్రితం కోల్ కతాకు చెందిన మోడల్ ను సంప్రదించారు. తాము తీయబోయే చిత్రంలో అవకాశం ఇస్తామని చెప్పి నగరానికి తీసుకొచ్చారు. ఆమెను ఫిలింనగర్ లోని ఓ ఫ్లాట్ లో ఉంచిన వీరు, సినిమా తీస్తున్నామని నమ్మించేందుకు కొన్ని దృశ్యాలను వీడియో కెమెరాతో చిత్రీకరించారు కూడా. ఆమె ఫోటోలు తీసి వాట్స్ యాప్ లో పెట్టి, రేటు కట్టిన వీరిద్దరూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించడం ప్రారంభించారు. వాట్స్ యాప్ లో ఫోటోలు గమనించిన పశ్చిమ మండలం పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతిని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రెస్క్యూ హోంకు తరలించామని, నిందితులను రిమాండుకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.