: బిరబిరా కృష్ణమ్మ పరుగులెక్కడ?
తెలుగుసీమలో బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే... బంగారు పంటలు పండుతాయి. నేడా కృష్ణమ్మ పరవళ్లు కనిపించడం లేదు. బంగారం పండించే ఆయకట్టు భూములకు చుక్క నీరు అందడం లేదు. ప్రతియేటా ఈ పాటికి జలాశయాలు నిండి, నిండు కుండలా కనిపించే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల తదితర ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. ఖరీఫ్ సీజను కోసం సాగర్ ఆయకట్టు నుంచి జూన్ 15నే నీరు వదలాల్సి వుండగా, ఆ సమయం దాటి రెండు వారాలు గడిచింది. ఇప్పటికీ కుడి, ఎడమ కాలువలకు నీరు వదల్లేదు. నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు వ్యాఖ్యానించారు. సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 511 అడుగులు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 510 అడుగులు. కృష్ణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకుంటే, నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నీరు రాకుంటే ఖరీఫ్ సీజను వృథా అయినట్టేనని రైతులు వాపోతున్నారు.