: విడుదలకు ముందే 'మాంఝీ'కి బీహార్ లో పన్ను మినహాయింపు
'మాంఝీ-ది మౌంటెన్ మ్యాన్' సినిమా విడుదలకు ముందే బీహార్ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపునిస్తున్నట్టు పేర్కొంది. బీహార్ క్యాబినెట్ సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. కాగా, బీహార్ కు చెందిన 'మౌంటెన్ మ్యాన్' దశరథ్ మాంఝీ జీవిత కధ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన 'మాంఝీ' విడుదలకు ముందే ఆసక్తి రేపుతోంది. దశరథ్ మాంఝీ భార్య ఫాల్గుణి దేవి అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లడంలో జరిగిన జాప్యం కారణంగా మృతి చెందింది. బీహార్ లోని గెహలూర్ నుంచి గయకు 55 కిలోమీటర్ల దూరం, ఊరికి ఆనుకుని కొండ ఉండడంతో దూరం పెరిగింది.
ఆ దూరమే తన భార్యను తన నుంచి దూరం చేసిందని ఆగ్రహించిన దశరథ్ మాంఝీ ఆ కొండను తవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో అంతా అతనిని పిచ్చోడన్నారు, గేలి చేశారు. అయినా ఆయన ఏనాడూ నిరాశ చెందలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా 22 ఏళ్లు శ్రమించి చివరికి కొండను పిండిచేశాడు. దీంతో 55 కిలో మీటర్ల దూరం కాస్తా 15 కిలో మీటర్లు అయింది. దశరథ్ మాంఝీ శ్రమను గుర్తించిన బీహార్ ప్రభుత్వం రోడ్డును వేయించింది. దీంతో గెహలూరు నుంచి గయకు కేవలం 15 కిలోమీటర్ల దూరం అయింది. అంతా అతనిని అభినందించడం మొదలు పెట్టారు. 2006లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌంటెన్ మ్యాన్ గా పేరొందిన దశరథ్ మాంఝీకి పద్మశ్రీ ఇవ్వాలని సిఫారసు చేశారు. దీనిని సినిమాగా కేతన్ మెహతా రూపొందించారు. ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది.