: 300 వికెట్ల క్లబ్బులో మిచెల్ జాన్సన్

ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ 300 వికెట్ల క్లబ్బులో చేరాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న యాషెస్ టెస్టులో జానీ బెయిర్ స్టో (5)ను అవుట్ చేయడం ద్వారా జాన్సన్ టెస్టుల్లో 300వ వికెట్ చేజిక్కించుకున్నాడు. జాన్సన్ విసిరిన షార్ట్ బంతి బెయిర్ స్టో శరీరం దిశగా దూసుకువచ్చింది. దాన్ని ఆడేందుకు ఆ ఇంగ్లిష్ ఆటగాడు ప్రయత్నించగా, బంతి గ్లోవ్ ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ నెవిల్ చేతుల్లో వాలింది. అదే ఓవర్లో బెన్ స్టోక్స్ (0) ను కూడా అవుట్ చేయడంతో ఈ లెఫ్టార్మ్ సీమర్ ఖాతాలో 301వ వికెట్ చేరింది. బెన్ స్టోక్స్ కు కూడా 'బెయిర్ స్టో' తరహా బంతే ఎదురైంది జాన్సన్ నుంచి. బంతి మరీ అంత షార్ట్ పిచ్ కాకపోయినా, స్టోక్స్ కూడా వికెట్ కీపర్ నెవిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, టెస్టుల్లో 300కు పైగా వికెట్లు సాధించిన ఐదో ఆసీస్ బౌలర్ గా జాన్సన్ రికార్డు పుటల్లో చోటు సంపాదించాడు. షేన్ వార్న్ (708), మెక్ గ్రాత్ (563), డెన్నిస్ లిల్లీ (355), బ్రెట్ లీ (310)... జాన్సన్ కంటే ముందున్నారు.

More Telugu News