: యాకూబ్ మెమన్ ఇచ్చిన ఒకే ఒక్క వీడియో ఇంటర్వ్యూ, ఏమన్నాడంటే!
1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో నేడు ఉరితీయబడ్డ యాకూబ్ మెమన్ ఒకే ఒక్క వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'న్యూస్ ట్రాక్' ఈ ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ ఇంటర్వ్యూలో యాకూబ్ వెల్లడించిన వివరాలివి...
ప్రశ్న: 1993 మార్చిలో ముంబై నుంచి దుబాయ్ కి వెళ్లారా?
జవాబు: అవును.
ప్రశ్న: పాకిస్థాన్ ఎలా చేరారు?
17న నేను పీఐఏ విమానంలో దుబాయ్ మీదుగా కరాచీ వెళ్లాను. నా వెంట ఓ పాకిస్థానీ ఏజంట్ ఉన్నాడు. ఇమిగ్రేషన్ విషయంలో అతనే సహాయం చేశాడు.
ప్రశ్న: అతనెవరు?
జవాబు: అతని పేరు ఆసిఫ్. విమానాశ్రయంలో అతనికి మంచి పరపతి ఉంది. నాకు పాస్ పోర్టు తదితరాలు ఏమీ లేకుండా వెళ్లాను. ఇండియన్ పాస్ పోర్టు లేకుండానే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
ప్రశ్న: అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు?
జవాబు: నన్ను కరాచీ పరిధిలోని ధురాజీ కాలనీలో ఉన్న తౌఫీక్ జలియన్ వాలా అనే వ్యక్తి బంగళాకు తీసుకెళ్లారు. మేము అక్కడే ఉన్నాం. 17న నేను, నా భార్య, అన్న అక్కడికి వెళ్లాము. మరో నాలుగు రోజుల తరువాత నా మిగతా కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు.
ప్రశ్న: ఇంకా ఎక్కడెక్కడికి వెళ్లారు?
జవాబు: మరో 8 రోజుల తరువాత మమ్మల్ని తౌఫిక్ కొత్త భవనానికి తీసుకెళ్లారు. ఆపై అక్కడే ఉన్నాం.
ప్రశ్న: ఈ తౌఫీక్ ఎవరు?
జవాబు: తౌఫీక్ మా అన్న 'టైగర్' స్నేహితుడు. దుబాయ్ లో వ్యాపారం చేస్తుంటాడు. పాకిస్థానీ.
ప్రశ్న: ఏ వ్యాపారం చేస్తాడు?
జవాబు: ఆ వివరాలు నాకు పెద్దగా తెలియదు. కరాచీలో కన్ స్ట్రక్షన్ వ్యాపారం చేస్తుంటాడనుకుంటా.
ప్రశ్న: టైగర్ పాకిస్థాన్ లో వ్యాపారం చేస్తున్నాడా?
జవాబు: లేదు, లేదు. పాకిస్థాన్ లో టైగర్ కు ఎటువంటి వ్యాపారాలు లేవు.
ప్రశ్న: టైగర్ చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి తెలుసా?
జవాబు: తెలీదు. నేను నా అన్నతో పెద్దగా మాట్లాడింది లేదు. స్పష్టంగా చెప్పాలంటే, ఓ గంట సేపు మాట్లాడివుంటాను.
ప్రశ్న: మీరు ఒకే ఇంట్లో నివసిస్తారు కదా?
జవాబు: అవును. చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. అయినా పెద్దగా కలిసేది ఉండదు.
ప్రశ్న: పాకిస్థాన్ లో మీ ఆర్థిక అవసరాలు తీర్చింది ఎవరు?
జవాబు: టైగర్, తౌఫీక్ లు.
ప్రశ్న: మీరేమీ సంపాదించలేదా?
జవాబు: 8 నెలల తరువాత సంపాదన ప్రారంభించాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. చిన్న తమ్ముడు అయీబ్ బియ్యం వ్యాపారం చేశాడు. పాక్ లో టైగర్ నుంచి ఎంతో మద్దతు తీసుకున్నాను.
ప్రశ్న: ఏప్రిల్ లో బ్యాంకాక్ వెళ్లారా?
జవాబు: అవును. మమల్ని బ్యాంకాక్ తీసుకెళ్లారు. అప్పుడే నాకు ఏం జరుగుతోంది అనేది తెలిసింది. అప్పటి వరకూ అసలు విషయమే నాకు తెలియదు.
ప్రశ్న: ఏ విషయం?
జవాబు: ఈ బాంబు పేలుళ్లు, దాని వెనకున్న కుట్ర
ప్రశ్న: బ్యాంకాక్ కు మీ వెంట ఎవరు వచ్చారు?
జవాబు: పాకిస్థానీ ప్రభుత్వ అధికారి కెప్టెన్ సావర్ అలియాస్ ఉస్మాన్ మాతోపాటు ఉన్నారు. అక్కడ మేము 12 రోజులు ఉన్నాము. పాక్ అధికారులే మాకు ఏర్పాట్లు చేశారు. తిరిగి పాక్ వచ్చి డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ భవనంలో ఉన్నాము. మాకు కొత్త ఇంటి స్థలం కింద కరాచీ హౌసింగ్ డెవలప్ మెంటు ప్రాజెక్టులో 1000 గజాల స్థలం ఇచ్చారు. దానికి కావాల్సిన రూ. 60 లక్షలు టైగర్ ఇచ్చారు.
ప్రశ్న: పాకిస్థాన్ మీకు ఆశ్రయం ఇచ్చింది. కొత్త ఐడీ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇదంతా ఎందుకోసం చేసింది?
జవాబు: నేను టైగర్ సోదరుడిని కాబట్టి. ఈ బాంబు పేలుళ్ల వెనుక పాక్ అధికారులు ఉన్నారు. టైగర్ తో ఈ పని చేయించారు కాబట్టి, ఆయన కుటుంబ సభ్యుడిగా నాకూ గౌరవం ఇచ్చి ఉండవచ్చు.
ప్రశ్న: అయితే, మీరు టైగర్ కు ఎటువంటి సాయమూ చేయలేదా?
జవాబు: లేదు.
ప్రశ్న: పాక్ అధికారులు ఇదేమీ తెలుసుకోకుండానే మీకు సాయపడ్డారా?
జవాబు: నాకు తెలీదు. కేవలం టైగర్ కుటుంబానికి చెందిన వాళ్లం కాబట్టే మాకు ఆశ్రయం కల్పించారని భావిస్తున్నాం.
ప్రశ్న: మీరెందుకు ఆపలేకపోయారు?
జవాబు: అప్పటి పరిస్థితులు వేరు. నాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. నా జీవితం గురించి మాత్రమే ఆలోచించాను.
ప్రశ్న: మీ అన్న టైగర్ ఏ విధంగా పేలుళ్లకు కుట్ర జరిపారు?
జవాబు: కరాచీ వెళ్లిన తరువాత ఆయనతో మాట్లాడాను. మార్చి 20 ఆ ప్రాంతంలో, పేలుళ్లు జరిగిన పది రోజుల తరువాత. మొత్తం కుట్ర గురించి తెలిసింది.
ప్రశ్న: ఆ తరువాతైనా మాతృదేశానికి రావాలనిపించలేదా?
జవాబు: నాకు ఆ అవకాశం లేదు. నా గొంతుపై కత్తి ఉంది. నా కుటుంబం గురించే ఆలోచించాను.
ప్రశ్న: పాక్ ప్రభుత్వం అందించిన అన్ని సౌకర్యాలూ అనుభవించారు. లగ్జరీ జీవితం గడిపారు. ఇదేనా మీకున్న దేశభక్తి? మీ కథను ప్రజలు నమ్మాలా?
జవాబు: ప్రజలు నమ్మి ఏదో చేస్తారని నేను చెప్పడం లేదు. నాకు తెలిసిన నిజాలను మీ ముందుంచుతున్నా.
ప్రశ్న: వెంటనే ఇండియాకు తిరిగి ఎందుకు రాలేదు?
జవాబు: నేనో ఇంట్లో ఉన్నాను. చుట్టూ నలుగురు గార్డులుండేవారు. బయటకు వచ్చే వీలులేదు. అంతకుమించి దేశాన్ని దాటే వీలు అంతకన్నా లేదు. అవకాశం కోసం ఎదురుచూసి, అది లభించిన తరువాత ఇండియా వచ్చాను. ఈ పేలుళ్ల వెనక ఎవరున్నారో ప్రజలకు చెప్పాలని వచ్చాను. నా కుటుంబం లేదని స్పష్టం చేయడానికి ఇండియాకు వచ్చాను. పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసు. పాకిస్థాన్ ప్రభుత్వం దీని వెనుక ఉంది.
ప్రశ్న: పాకిస్థాన్ లో ఎంత కాలం ఉన్నారు?
జవాబు: ఏడాదిన్నర.
ప్రశ్న: టైగర్ ఎక్కడ పనిచేసేవాడు?
జవాబు: 1978లో ఓ బ్యాంకులో క్లర్క్ గా చేరి మూడునాలుగేళ్లు పనిచేశాడు. ఆ తరువాత ఎలక్ట్రానిక్ గూడ్స్ షాపులో చేరాడు.
ప్రశ్న: అతని ఇతర ఆదాయ మార్గాలు ఏంటి?
జవాబు: స్మగ్లింగ్
ప్రశ్న: ఒకే ఇంట్లో ఉంటున్న మీకు టైగర్ చేసే కుట్రల గురించి ముందుగా తెలియదు అంటే నమ్మాలా? ప్రతి భారతీయుడికీ ఈ విషయం తెలుసు.
జవాబు: 1990లో మాత్రమే టైగర్ స్మగ్లింగ్ చేస్తారన్న సంగతి నాకు తెలిసింది. అంతకుముందు తెలియదు.
ప్రశ్న: మీరు చెప్పేదాన్ని ముంబైలోని ఒక్క వ్యక్తి కూడా నమ్ముతాడని నేను అనుకోవడం లేదు... ఇలా ఎలా?
జవాబు: మీకు నా జీవితం గురించి తెలియదు. 1978 నుంచి నేను నా చదువులో బిజీగా ఉన్నాను. ఎలాంటి విషయాలూ పట్టించుకోలేదు.
ప్రశ్న: పాకిస్థాన్ వెళ్లాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
జవాబు: పేలుళ్ల అనంతరం పరిస్థితులు మారుతున్నాయని టైగర్ చెప్పిన తరువాత. కొద్ది రోజులు దుబాయ్ లో ఉండి వద్దామని నాతో అన్నాడు. పిల్లల చదువుల కోసం వెళ్లాలని చెప్పాడు. అప్పటికీ నేను అంగీకరించలేదు. నాపై ఒత్తిడి తెచ్చాడు. కుటుంబం కోసం వెళ్లక తప్పలేదు.
ప్రశ్న: ముంబై పేలుళ్ల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు?
జవాబు: తౌఫీక్ జలియన్ వాలా ఐఎస్ఐ సహకారాన్ని తీసుకుని ఈ పని చేయించాడు. అందుకు టైగర్ పూర్తి సహాయపడ్డాడు. టైగర్ అనుచరులకు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది.
ప్రశ్న: ఇండియాలో ఇంకా ఎవరికి ప్రమేయముంది?
జవాబు: నాకు తెలియదు. టైగర్, ఆయన అనుచరులు, పాక్ ప్రభుత్వ ఏజంటుగా తౌఫీక్.
ప్రశ్న: జావీద్ చిక్నా గురించి తెలుసా?
జవాబు: ఆయన పేరు విన్నాను. పాకిస్థానీ అని మాత్రమే తెలుసు.
ప్రశ్న: మరి ఇజాజ్ పఠాన్..?
జవాబు: ఇజాజ్ కూడా పాకిస్థానీ. వాళ్లిద్దరినీ నేను కలవలేదు. వీరి గురించి టైగర్ కారు డ్రైవర్ షఫీ చెప్పేవాడు. షఫీ నాకు మంచి స్నేహితుడు.
ప్రశ్న: ఎంతమంది భారతీయ ముస్లింలకు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చింది?
జవాబు: టైగర్ అనుచరులు.. 8 నుంచి 10 మందికి... బాంబు పేలుళ్లలో పాల్గొన్నవారికి పాక్ ఆశ్రయమిచ్చింది. మిగతావారి గురించి నాకు తెలియదు.
ప్రశ్న: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడా?
జవాబు: నాకు తెలియదు. తౌఫీక్ చెప్పినదాన్ని బట్టి అతను పాక్ లో ఉన్నట్టే. ఆయన్ను నేను ఎప్పుడూ కలవలేదు.
(ఈ ఇంటర్వ్యూను 'న్యూస్ ట్రాక్' యాంకర్ మధు త్రెహాన్ 1994 ఆగస్టు 17న తీసుకున్నారు)