: అబ్దుల్ కలాంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నేటి ప్రవచనాల్లో పేర్కొన్నారు. ఆ వివరాలు చాగంటి వారి మాటల్లోనే..."అబ్దుల్ కలాం తనకు వచ్చిన ఉద్యోగం ఇష్టం లేక రిషికేష్ లోని ఓ స్వామీజీ దగ్గరకు వెళ్లారు. అక్కడ స్వామీజీని కలిశారు. అప్పుడు ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆయన ముఖంలో నీరసం స్పష్టంగా కనపడుతోంది. కలాం కోరుకున్న ఉద్యోగం వేరు, ఆయనకు వచ్చిన ఉద్యోగం వేరు. తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. అటువైపుగా వెళ్లిపోతున్న స్వామీజీ కలాంను పిలిచి, ఏం అలా కూర్చున్నావని ప్రశ్నించారు. నేను ఫలానా ఉద్యోగం కోసం వెళ్లాను. అయితే, నేను కోరుకున్న ఉద్యోగం రాలేదు. వేరేది వచ్చింది. ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకీ ఉద్యోగం చెయ్యాలని లేదు... అన్నారు. దానికి ఆ స్వామీజీ ఓ చిరునవ్వు నవ్వి... 'నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో జరగాలని ఎందుకనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడో అదే నీకు ఇచ్చాడని భావించి, నీకు వచ్చిన దానిని ఈశ్వర నిర్ణయంగా తలచి, ఎందుకు వెళ్లలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో!' అన్నారు. ఆ మాట కలాం మీద పనిచేసింది. దానిని ఆయన అంగీకరించారు కాబట్టి, ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి అవసరమైన సత్తానిచ్చిన మహానుభావుడయ్యారు. ఆ కారణంగా రెండో మాటు రాష్ట్రపతి పదవిని తృణప్రాయంగా వదిలి, విద్యార్థులతో మాట్లాడడమే నాకిష్టమని కాలేజీ కాలేజీకి, యూనివర్సిటీలకి వెళ్లి...పిల్లలందరితో ఎంతో సంతోషంగా గడిపారు. అదీ క్యారెక్టరంటే... అందుకు నేను మురిసిపోతాను. మహానుభావుడు 'వింగ్స్ ఆఫ్ ఫైర్' పుస్తకంలోని ప్రిఫేస్ లో రాసుకున్నారు. అమ్మా! ఇవ్వాళ ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి, ఈ వేళ అబ్దుల్ కలాం డిఫెన్స్ శాస్త్రవేత్త, కానీ అమ్మా ఇంత మేధాశక్తి ఎక్కడ్నించి వచ్చిందో తెలుసా? రామేశ్వరంలోని ఓ పెంకుటింట్లో గుడ్డి దీపం కింద చదువుకుంటూ, రాత్రి 8 గంటలకి ఆకలేస్తే పళ్లెం పట్టుకుని, పరిగెత్తుకొచ్చి నీ కాళ్ల దగ్గర కూర్చుని...అమ్మా అమ్మా నాకాకలేస్తోందమ్మా అంటే...నువ్వు పొయ్యి దగ్గర నిలబడి ఇలా ఇలా అటూ ఇటూ తిప్పి నూనె వెయ్యని రెండు రొట్లు నా ప్లేటులో వేసి అత్యంత ప్రేమతో కూర వేసి, నా తల మీద చేతితో నిమిరి, నాన్నా నువ్వు ఎంతో వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకో అంటూ నువ్వు పెట్టిన రొట్టెలు, ఈ అబ్దుల్ కలాంలో ఇంత మేధా శక్తిగా మారాయమ్మా... నేను ఎదురు చూసేది ఏంటో తెలుసా? ఏదో ఒకనాడు అబ్దుల్ కలాం అని గౌరవింపబడిన ఈ శరీరం పడిపోతుంది. ఈ గౌరవాలందుకున్న నేను నమస్కరిద్దామంటే నీ శరీరం లేదు. ఈ శరీరం పడిపోగానే నేను చేసే మొదటి పని, నువ్వు ఏ శరీరంతో ఏ లోకానికెళ్లావో ఆ శరీరంతో ఆ లోకానికి వచ్చి ఈ పృథ్వి మీద ఇంత కీర్తికి కారణమైన ఆశీర్వాదమిచ్చిన నీ కాళ్లను నమస్కరిస్తానమ్మా" అని ఆయన చెప్పారు. అదీ కొడుకంటే... అలా ఉండాలి" అంటూ చాగంటి వారు భావయుక్తంగా చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది.

  • Loading...

More Telugu News