: టీసీఎస్, విప్రో, ఇన్ఫీలు మాకొద్దన్న లక్ష మంది!

146 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91 వేల కోట్లు) విలువైన భారత ఐటీ ఇండస్ట్రీలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి అట్రిషన్ రేటు పెరిగింది. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలను వీడి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం కంపెనీల యాజమాన్యానికి గుబులు పుట్టిస్తోంది. గడచిన నాలుగు త్రైమాసికాల వ్యవధిలో ఈ మూడు కంపెనీల నుంచి సుమారు లక్ష మంది ఉద్యోగులు 'జంప్ జిలానీ'లుగా మారారు. ఇదే సమయంలో ఐటీ కంపెనీలు కొత్తగా 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి. దీంతో నికరంగా సుమారు 40 వేల నుంచి 50 వేల మంది వరకూ ఐటీ రంగంలో కొత్తగా చేరినట్లయింది. ఉద్యోగులను వీడి వెళ్తున్న వారిని ఆపడంలో విఫలమవుతున్నట్టు రెండు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు అభిప్రాయపడ్డారు. బయట మెరుగైన వేతనాలు లభిస్తుండటం, స్టార్టప్ కంపెనీలతో పాటు ఈ-కామర్స్ సంస్థల విస్తరణ ఇందుకు కారణాలని వారు వివరించారు. 19 నుంచి 20 శాతం అట్రిషన్ రేటు ఐటీ కంపెనీల్లో సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు, భవిష్యత్ ఆదాయం సంతృప్తికరంగా ఉన్న ఇన్ఫోసిస్ లోనే ఉద్యోగాలను వీడి వెళ్తున్న వారి సంఖ్య 22.3 శాతానికి పెరిగింది. ఐదేళ్ల క్రితం ఇన్ఫీలో అట్రిషన్ రేటు 13.4 శాతం మాత్రమే. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నుంచి 8,553 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక టీసీఎస్ నుంచి 15 వేల మందికి పైగా జంప్ కొట్టారు. విప్రో నుంచి 12,500 మంది వెళ్లిపోయారు. ఇండియాలో 2 వేలకు పైగా ఐటీ కంపెనీలుండగా, ఇవన్నీ ప్రతియేటా వేల మందికి ఉపాధి అవకాశాలు దగ్గర చేస్తున్నాయి. అయితే, కంపెనీల్లో ఆటోమేషన్ కు ప్రాధాన్యత ఇస్తుండటం, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికత అందుబాటులో ఉండటం వంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో ఉన్న ఐటీ సంస్థలు రాజీనామాలు చేసి వెళ్తున్న వారి స్థానంలో ఆ స్థాయిలో నియామకాలను చేపట్టడం లేదని తెలుస్తోంది.

More Telugu News