: పల్నాడుకు తిరిగొచ్చిన 'చంద్రవంక' దళం... రాజకీయ నేతలకు హెచ్చరికలు!

గతకొంత కాలంగా చడీచప్పుడూ లేని మావోలు తిరిగి వెలుగులోకి వచ్చారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పోస్టర్ల రూపంలో కనిపించారు. రాజకీయ నాయకులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని, వీరికి త్వరలోనే తగిన శిక్ష విధిస్తామని ప్రకటించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, శిరిగిరిపాడు తదితర గ్రామాల్లో గోడలపై కనిపించిన ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. గతంలో ఎన్నడో అణిగిపోయిందనుకున్న 'చంద్రవంక' దళం పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. రాజకీయ నేతలతో పాటు పోలీసులకు తమ గురించి సమాచారం పంపుతున్న ఇన్ ఫార్మర్లనూ వదిలిపెట్టబోమని మావోలు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవులు ఒకప్పుడు మావోలకు కంచుకోట. ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో కొందరు దండకారణ్యం వైపు వెళ్లిపోగా, మరికొందరు పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసిపోయారు. తిరిగి ఇప్పుడు మావోల చర్యలు ప్రారంభం కావడంతో ప్రజలతో పాటు పోలీసుల్లో సైతం చర్చ జరుగుతోంది.

More Telugu News