: గుంటూరు జిల్లాలో రియల్ మాఫియా ఆగడం... రెవెన్యూ సిబ్బందిపై భౌతిక దాడి
నవ్యాంధ్ర నూతన రాజధానికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో రియల్ మాఫియా ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేయడమే కాక, సర్కారీ భూములను కాపాడుకునేందుకు యత్నిస్తున్న రెవెన్యూ యంత్రాంగంపై భౌతిక దాడులకు దిగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి సమీపంలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో నిన్న రియల్ మాఫియా వీర విహారం చేసింది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు, దానిని కాపాడుకునేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై మూకుమ్మడి దాడికి దిగారు. రియల్టర్ల ప్రతాపంతో రెవెన్యూ సిబ్బంది పరుగులు పెట్టి మరీ ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే వీఆర్వో చలపతి, వీఆర్ఏ శ్రీనివాస్ లను వెంటాడి పట్టుకున్న రియల్ మాఫియా వారిపై భౌతిక దాడికి దిగింది. ఈ దాడిలో వీఆర్వో చలపతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి దృశ్యాలను చిత్రీకరించిన ఓ న్యూస్ చానెల్, వాటిని ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రియల్ మాఫియా సభ్యులు కరీముల్లా, సుభానీ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.