: రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చా... ఓబుళదేవర చెరువులో రాహుల్
కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన ఓబుళదేవర చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ ప్రకటించారు. ఇందిరమ్మ విలువలు తన రక్తంలో ఉన్నాయని ఆయన చెప్పారు.
ఏపీలో రైతులు, చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారన్నారు. రైతుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో తనకు తెలుసన్నారు. రైతుల అనుమతితోనే భూములు తీసుకోవాలని తమ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. అయితే ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ మోదీ సర్కారు మార్పులు చేర్పులు చేస్తోందని ఆరోపించారు. రహస్య ఎజెండాతో మోదీ ముందుకు సాగుతున్నారని నిందించారు. రైతుల, చేనేతల కన్నీళ్లు తుడిచేదాకా కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు.