: రాహుల్ ను రాజీవ్ గాంధీ అని సంబోధించి నాలుక కరుచుకున్న చిరంజీవి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి నోరు జారారు. రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీ అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. వెంటనే సరిదిద్దుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన సాక్షాత్తు రాహుల్ గాంధీ సమక్షంలోనే జరగడం విశేషం. అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన సందర్భంగా, ఓబులదేవర చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చిరంజీవి ఈ తత్తరపాటుకు గురయ్యారు.
ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్ గాంధీ వచ్చారని తెలిపారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులు కుదేలైపోయారని... ఆ తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. మళ్లీ గత ఏడాది నుంచి రైతుల ఆత్మహత్యలు 35 శాతం పెరిగాయని తెలిపారు. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడం టీడీపీకి సిగ్గు చేటని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు రాహుల్ నాయకత్వంలో అందరం పోరాడతామని చెప్పారు.