: జీవితఖైదు శిక్ష పడిన వారికి రాష్ట్రాలు క్షమాభిక్ష పెట్టవచ్చు: సుప్రీంకోర్టు
జీవితఖైదు శిక్ష పడిన వారికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే సీబీఐ లేదా కేంద్ర చట్టాల కింద దర్యాప్తు చేయనివారికి మాత్రమే ఉపశమనం కల్పించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. రాజీవ్ గాంధీ హంతకుల కేసు విచారణ సందర్భంగా జులై 9, 2014న తాను ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సవరించింది. అయితే జీవితాంతం శిక్ష అనుభవించాలని ఇచ్చిన తీర్పులలో, అలాగే నిర్ధారిత కాలం పాటు అంటే అత్యాచారం, హత్య కేసుల్లో 20 లేదా 25 సంవత్సరాలు తప్పనిసరిగా జైల్లోనే ఉండాలని ఇచ్చిన తీర్పు సందర్భాలలో మాత్రం క్షమాభిక్ష వర్తించబోదని సుప్రీం స్పష్టం చేసింది. కాగా ప్రస్తుత ఉత్తర్వులు రాజీవ్ హత్య కేసుకు వర్తించవని, ఈ కేసు ప్రస్తుతం ఇంకా విచారణలోనే ఉందని పేర్కొంది.