: సీఎం నిర్ణయం విశాల దృక్పథానికి నిదర్శనం... ఇలాంటి ప్రభుత్వం మరొకటిలేదు: ప్రెస్ అకాడమీ చైర్మన్
తెలంగాణ సర్కారును, సీఎం కె.చంద్రశేఖరరావును ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆకాశానికెత్తేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇది శుభదినమని, ఇంతమంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎంకు పాత్రికేయుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. జర్నలిస్టుల వైద్యానికి ఎంత ఖర్చయితే అంత మొత్తాన్ని ప్రభుత్వమే కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లిస్తుందని, ఖర్చుపై పరిమితి లేదని నారాయణ వివరించారు. కుటుంబం మొత్తం ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ తన మంచి మనసును చాటుకుంటూ, పాత్రికేయుల తల్లిదండ్రులను కూడా ఈ పథకంలో చేర్చారని కితాబిచ్చారు. ఈ నిర్ణయం ఆయన విశాల దృక్పథానికి నిదర్శనమని కీర్తించారు. ఇలాంటి పథకాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం దేశంలో మరొకటిలేదని, ఆ ఘనత సీఎందేనని అన్నారు.