: ఆ స్కూళ్లలో విద్యార్థులు బ్రాండెడ్ షూనే ధరించాలట!
దేశంలో ప్రైవేటు పాఠశాలల తీరుపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఎప్పటినుంచో పోరు సాగిస్తున్నాయి. ఫీజులు తదితర అంశాల్లో ప్రైవేటు స్కూళ్లు దోపిడీకి పాల్పడుతున్నాయన్నది దేశంలో అత్యధికుల అభిప్రాయం. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా అసంబద్ధంగా ఉంటాయి. తాజాగా, ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో పేరుమోసిన ప్రైవేటు స్కూళ్లు ఇప్పుడు తమ విద్యార్థులను బ్రాండెడ్ షూ ధరించాలని ఆదేశిస్తున్నాయి. పలానా కంపెనీ బూట్లే కొనాలని, అది కూడా తాము చెప్పిన షాపుకే వెళ్లాలని సూచిస్తున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఏ బ్రాండు కొనాలన్న స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉండాలని, స్కూళ్ల యాజమాన్యాలు చదువుపై దృష్టిపెట్టకుండా ఆదాయం పెంచుకోవడంపై శ్రద్ధ చూపిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. దీనిపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్ ముఖర్జీ మాట్లాడుతూ, బ్రాండెడ్ షూ కొనాలని పేర్కొన్నది నిజమేనని, బ్రాండెడ్ షూ అయితే అధిక కాలం మన్నుతాయని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు.