: మైక్రోసాఫ్ట్ కు రూ. 20,368 కోట్ల నష్టం... సంస్థ చరిత్రలో అత్యధికం!
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ స్థాపించిన తరువాత ఎన్నడూ లేనంత నికర నష్టం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో నమోదైంది. ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో సంస్థ 3.2 బిలియన్ డాలర్ల (సుమారు 20,368 కోట్లు) నెట్ లాస్ ను ప్రకటించింది. నోకియా ఫోన్ బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తాన్ని 'రైటాఫ్' చేయడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు డిమాండ్ తగ్గడం, ఆండ్రాయిడ్ వ్యవస్థతో విండోస్ పోటీ పడలేకపోవడం కారణాలతో సంస్థ నష్టాల పాలైంది. ఈ మూడు నెలల కాలంలో 4.61 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని వివరించింది. కాగా, మైక్రోసాఫ్ట్ ఫలితాల తరువాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో సంస్థ వాటా విలువ 4 శాతం దిగజారి 45.38 డాలర్లకు చేరింది. తమ దృష్టిని సాఫ్ట్ వేర్ నుంచి క్లౌడ్ సేవల వైపు మళ్లిస్తున్నామని ఫలితాల విడుదల సందర్భంగా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈనెల 29న విండోస్ 10ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే.