: పార్లమెంటులో ‘దమ్ము’ కొట్టేందుకు రూం కావాలట... స్పీకర్ ను కోరిన ఎంపీలు
పార్లమెంటు ఆవరణలో ధూమపానం నిషిద్ధం. 2004లో అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఈ మేరకు పార్లమెంటు ఆవరణను ‘నో స్మోకింగ్ జోన్’గా ప్రకటించారు. ఆ విషయం మన ప్రజా ప్రతినిధులకు గుర్తుందో, లేదో కాని... నిన్న మాత్రం అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా ‘ధూమపాన’ ఎంపీలంతా స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిశారు. తాము ‘దమ్ము’ కొట్టుకునేందుకు పార్లమెంటు ఆవరణలో ఓ గదిని కేటాయించాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం స్టెనోగ్రాఫర్లకు కేటాయించిన గదిని తమకు కేటాయించాలని వారు కోరారు. ఎంపీల అభ్యర్థనను స్పీకర్ కూడా ధ్రువీకరించారు. స్మోకింగ్ కోసం ఎంపీలు ప్రత్యేక గదిని కోరిన మాట వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. అయితే ధూమపానాన్ని వదిలేయాలని తాను వారికి సూచించానని కూడా స్పీకర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎంపీలు చేసిన అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆమె చెప్పారు.