: బుద్ధిగా కనిపిస్తోందని అమాయకురాలనుకునేరు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో అద్భుతమైన సినిమాగా విమర్శకుల ప్రశంసలందుకుంటున్న 'భజరంగీ భాయ్ జాన్' సినిమాలో నటించిన బాలనటి అల్లరితో యూనిట్ అలసిపోయేదట. సల్మాన్ తో సమానంగా పెర్ఫార్మెన్స్ చేసిన బాలనటి హర్షాలీ మల్హోత్రా ఒక్క చోట కుదురుగా ఉండేది కాదని సినిమా యూనిట్ పేర్కొంటోంది. సినిమాలో బుద్ధిగా కనిపిస్తూ, తనకేం తెలియదన్నట్టు అమాయకంగా కనిపించే హర్షాలీ యూనిట్ మొత్తం బొంగరంలా తిరిగేదట. చేయద్దన్న పనినే కచ్చితంగా చేసేదని, సల్మాన్ దగ్గర మాత్రం బుద్ధిగా ఉండేదని, సల్లూ భాయ్ చెబితే బుద్ధిగా వినేదని యూనిట్ గుర్తు చేసుకుంది. సల్మాన్ సెట్ లో కనపడకపోతే హర్షాలీ అల్లరికి అంతే ఉండేది కాదట. ఎంత అల్లరి చేసినా భలే ముద్దొచ్చేదని కాస్ట్యూమ్ డిజైనర్ ముఖేష్ చెప్పాడు. అందరి మాటా వినాలని సల్మాన్ చెప్పేవాడట. అయితే ఈ గడుగ్గాయి వింటేనా? 'అల్లరే అల్లరి' అంటూ సినిమా సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు.