: దేవత చెప్పిందని 200 మంది కలిసి మహిళ తల తెగనరికారు!
తలలు తెగనరుకుతున్న ఘటనలు ఇరాక్, సిరియాల నుంచి భారత్ కూ పాకింది. అసోంలోని సోనిత్ పూర్ జిల్లా పరిధిలోని భీమాజులీ గ్రామంలో ఓ మహిళ తలను తెగ్గోసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. 63 సంవత్సరాల మహిళ క్షుద్ర పూజలు చేస్తోందని ఆరోపిస్తూ, సుమారు 200 మంది దాడి చేసి ఆమెను వివస్త్రను చేసి, అందరూ చూస్తుండగానే తల నరికారు. ఆ ప్రాంత ఏఎస్పీ సంవాద్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, తాను దేవతనని చెప్పుకునే అనిమా రోగంటి (35), ఆదేశాల మేరకు స్థానిక దేవాలయం వద్దకు ప్రజలు వచ్చారు. ఆదివాసీ మహిళ ఓరాంగ్ కారణంగానే గ్రామానికి దురదృష్టం పట్టుకుందని, ఆమె క్షుద్రపూజలు చేస్తుందని అనిమా తన భక్తులకు చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆమె ఇంటిపై దాడి చేసిన భక్తుల గుంపు, పట్టపగలు వీధుల్లో నగ్నంగా నడిపించి తల తెగ్గోశారు. ఈ ఘటనలో అనిమా, ఆమె భర్త, సోదరి సహా నలుగురిని అరెస్ట్ చేశామని హుస్సేన్ వివరించారు. కాగా, గడచిన ఐదేళ్ల వ్యవధిలో క్షుద్రపూజల ఆరోపణలపై 100 మందికి పైగా మహిళలను హతమార్చిన ఘటనలు అసోంలో నమోదయ్యాయి.