: పుణ్యానికి పోయిన టెక్కీని తరుముకొచ్చిన మృత్యువు

వాహనాలపై కొండ చరియలు విరిగిపడగా గాయాలతో ఉన్నవారిని కాపాడేందుకు వెళ్లిన ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముంబై - పుణె హైవేపై ఖోపోలీ ప్రాంత సాఫ్ట్ వేర్ ఉద్యోగి గణపత్ పాండురంగ్ కుద్పాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హైవేపై అదోషీ టన్నెల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పైనుంచి రాళ్లు పడి బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు, ఓ కారులోని వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ప్రాంతంలోనే ఉన్న గణపత్ విషయాన్ని పోలీసులకు చెప్పి గాయపడిన వారికి సాయపడేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే వేగంగా వస్తున్న ఓ వాహనం గణపత్ ను ఢీ కొట్టింది. ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు విషయాన్ని గమనించి గణపత్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News