: ఆరు రోజులు కనిపించకుంటే రూ. 10 వేలు... ఏపీ సర్కారు బంపరాఫర్... వద్దేవద్దన్న బిచ్చగాళ్లు!
రాజమండ్రిలో బిచ్చగాళ్ల బెడదను తొలగించాలని ఏపీ సర్కారు భావిస్తే, తమకు అడుక్కోవడం మాత్రమే వచ్చని తేల్చిచెప్పిన బిచ్చగాళ్లు అధికారులు ఇచ్చిన బంపరాఫర్ ను వద్దంటూ వెళ్లిపోయారు. అసలు విషయం ఏంటంటే, నేడు సింగపూర్ నుంచి పలువురు అధికారులు రాజమండ్రికి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడుక్కునేవారు ఎక్కడా కనపడకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హుటాహుటిన రాజమండ్రి వీధుల్లో తిరిగిన అధికారులు, పోలీసులు దాదాపు 500 మంది బిచ్చగాళ్లను పట్టుకొచ్చి సమావేశం నిర్వహించారు. పుష్కరాలు అయిపోయే వరకూ ఎవరైనా అడుక్కుంటే వారి రేషన్ కార్డులు తీసేస్తామని తొలుత హెచ్చరించడంతో, కొంతమంది, ఆపై వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు, వివిధ ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములై కూడా యాచకాన్ని వృత్తిగా పెట్టకున్నవారు "ఇకపై అడుక్కోబోము" అని చెప్పి వెళ్లిపోయారు. ఇక ఏ ఆసరా లేకుండా ఉన్న యాచకులను ఆరు రోజుల పాటు వసతిగృహంలో ఉంచి, భోజనం పెడతామని, ఒక్కొక్కరికి రూ. 10 వేలు ఇస్తామని అధికారులు చెప్పారు. ఆలోచించుకుని చెబుతామంటూ బయటకు వచ్చిన వారు, తాము ఎక్కడ కూర్చున్నా అంతకంటే ఎక్కువే సంపాదిస్తామని చెబుతూ, ఈ ఆఫర్ వద్దేవద్దంటూ వెళ్లిపోయారు. అదీ మన బిచ్చగాళ్ల స్టేచర్!