: బీరుతో కూడా కారు నడపొచ్చు!
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మంచి నీటికంటే బీరు వినియోగం ఎక్కువని పలువురు పేర్కొంటూ ఉంటారు. అంత సులభంగా లభ్యమయ్యే బీరు భవిష్యత్ లో ప్రియం కానుంది. ఎందుకంటే బీరుతో వాహనాలు నడిపే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పెట్రోలు, డీజిల్ తోనే కాకుండా బీరుతో కూడా కారునడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. న్యూజిలాండ్ లోని ఓ పెట్రోల్ స్టేషన్ దీనిని పరీక్షించి నిరూపించింది. న్యూజిలాండ్ లో డీబీ ఎక్స్ పోర్ట్ అనే సంస్థ 30 వేల లీటర్ల ఇథనాల్ (బీర్ లో వాడేది)కు తగు మొత్తంలో పెట్రోల్ కలిపి, మూడు లక్షల లీటర్ల బయో ఫ్యూయల్ ను తయారు చేసింది. ఇలా తయారు చేసిన పదార్థానికి 'బ్రూట్రోలియం' అని పేరు పెట్టింది. ఈ బయో ఫ్యూయల్ ను నింపుకున్న వాహనాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణించడం విశేషం. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెట్రోల్ కొరత సమస్యను అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.