: మౌనం వీడిన రవిశాస్త్రి
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో ఓటమిపాలైన తర్వాత టీమిండియాలో లుకలుకలున్నాయంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, జట్టులో రెండు గ్రూపులు తయారయ్యాయని, ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలు నెలకొన్నాయని విశేషంగా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ పరిణామాలపై టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి స్పందించారు. టీమిండియాలో ఎలాంటి సంక్షోభం తలెత్తలేదని అన్నారు. ధోనీ, కోహ్లీ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని తెలిపారు.
తాను డ్రెస్సింగ్ రూంలో పారదర్శకత కోరుకున్నానని చెప్పారు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే, వ్యక్తుల వెనుక కాకుండా... డ్రెస్సింగ్ రూంలో అందరి ముందు చెప్పాలని సూచించానని తెలిపారు. ఆటగాళ్లలో పరస్పర విశ్వాసం ఉందని, ఒకరి కోసం మరొకరు అన్న రీతిలో ఆడతారని, ఒకరి విజయాలను మరొకరు ఆస్వాదిస్తారని శాస్త్రి వివరించారు. తన పనితీరు గురించి చెబుతూ... ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడంపై తాను దృష్టిపెట్టానని ఈ మాజీ ఆల్ రౌండర్ తెలిపారు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో మీరూ ఒకరు అన్న భావన ఆటగాళ్లలో కలిగించేందుకు శ్రమించానని వివరించారు.