: మరింత గడువు ఇవ్వండి...తెలంగాణ ఏసీబీని కోరనున్న సండ్ర?

ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన దాగుడుమూతల పర్వాన్ని మరిన్ని రోజులు కొనసాగించనున్నారా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నుంచి జారీ అయిన రెండు నోటీసులకు సండ్ర వెంకటవీరయ్య స్పందించినా, విచారణకు మాత్రం హాజరుకాలేదు. విచారణకు మరింత సమయం కోరుతూ ఆయన ఏసీబీకి రాసిన లేఖ గడువు కూడా నేటితో ముగియనుంది. అయితే ఇప్పటికీ సండ్ర జాడ లేదు. ఏపీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని చెబుతున్న ఆయన సదరు ఆస్పత్రి పేరు కాని, ఆ ఆస్పత్రి ఉన్న నగరం పేరు కాని వెల్లడించలేదు. తీరా తనకు తాను విధించుకున్న గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో మరింత గడువు కోరుతూ ఆయన నేడు ఏసీబీకి లేఖ రాయనున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ మేరకు పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని ఆయన సన్నిహితులు మీడియాకు లీకులిచ్చారు. మరి దీనిపై ఏసీబీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

More Telugu News