: 'మనసులో మాట' వెల్లడించిన ప్రధాని మోదీ
అభివృద్ధి చెందిన దేశమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా, ప్రపంచమంతా యోగాను గౌరవిస్తున్నారని, అది ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాలో కుటుంబ విలువలు ఎంతో గొప్పవని, పూర్వీకులు అందించిన మన సంప్రదాయాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాయని గుర్తు చేసిన ఆయన ఢిల్లీలోని రాజ్ పథ్, యోగాపథ్ గా మారిపోయిందని అన్నారు. తనను ప్రధానిగా ఎన్నుకున్న ప్రజలకు అభినందనలు తెలుపుతూ, సేవ చేసుకునే భాగ్యం దక్కినందుకు తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సైతం యోగా చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
నేపాల్ ను భూకంపం బాధించినప్పుడు వందలాది మంది భారతీయులు సహాయం చేసేందుకు ఆ దేశానికి పరుగులు పెట్టారని, అంతకుమించి లక్షలాది మంది తమదైన శైలిలో సాయపడ్డారని కొనియాడారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత నెలలో ప్రజల కోసం మూడు పథకాలు ప్రారంభించామని, వీటికి అతి తక్కువ సమయంలో ఎంతో ప్రజాధరణ లభించిందని వివరించారు. నెల రోజుల వ్యవధిలో 10 కోట్ల మందికి పైగా 'జన్ సురక్షా యోజన' పథకాల్లో చేరారని తెలిపారు. రక్షాబంధన్ పండగ నాడు రాఖీలు కట్టించుకునే వారు తమ సోదరీమణులకు రూ. 330 లేదా రూ. 12 లేకుంటే రెండింటి మొత్తాన్నీ వెచ్చించి బీమా పథకాల్లో భాగం చేసేలా బహుమతులు ఇవ్వాలని తాను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నట్టు మోదీ తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.