: జడేజా, రైనా, బ్రావోలు ఐపీఎల్ ఫిక్సర్లు... ఆటంబాంబు పేల్చిన మోదీ

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఈ దఫా ఆటంబాబు పేల్చారు. ఐపీఎల్ లో మ్యాచ్ లను ఫిక్స్ చేసిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లు, వారికి లభించిన ప్రతిఫలాల వివరాలను తాను జూన్ 2013లో ఐసీసీ సీఈఓ డేవ్ రిచడ్ సన్ కు లేఖను రాశానని చెబుతూ, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. జూన్ 20, 2013న రాసినట్టుగా ఉన్న లేఖలో రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సురేష్ రైనాలు నిర్మాణ రంగ దిగ్గజం హెచ్ డీఐఎల్ కు చెందిన బాబా దివాన్ నుంచి భారీగా పారితోషికాలు తీసుకుని మ్యాచ్ లను ఫిక్స్ చేశారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి బాబా దివాన్ ఐపీఎల్ టీములను కొనుగోలు చేయకుండా తాను నిషేధం విధించానని, ఆపై బాబా దివాన్, రాజ్ కుంద్రాకు, గురుకు సన్నిహితుడిగా మారాడని తెలిపాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఫ్లాట్లు, డబ్బు అందినట్టు తనకు నమ్మకమైన వర్గాల నుంచి సమాచారం వచ్చిందని తెలిపాడు. సురేష్ రైనాకు ఢిల్లీలోని వసంత్ విహార్, నోయిడాల్లో ఫ్లాట్లు దక్కాయని, రవీంద్ర జడేజాకు ముంబైలోని బాంద్రాలో హెచ్ డీఐఎల్ కు చెందిన కొత్త భవనం కానుకగా లభించిందని, బ్రావో నగదు తీసుకున్నాడని వివరించాడు. ఈ సమాచారం నిజం కాకూడదని కోరుకుంటున్నానని, నిజమైతే బాబాపై నిఘా పెంచాలని, ఆయన ఒక్కో గేముపై 10 నుంచి 20 మిలియన్ డాలర్లు (ప్రస్తుత కరెన్సీ మారకపు విలువ ప్రకారం సుమారు రూ. 63 కోట్ల నుంచి రూ.126 కోట్లు) బెట్టింగ్ చేస్తున్నాడని తెలిపాడు. మోదీ రాసిన ఈ లేఖ ఇప్పుడు భారత క్రికెట్ క్రీడా ప్రపంచంలో పెను చర్చను లేవనెత్తింది.

More Telugu News