: డాక్టరు ఉద్యోగానికి ఎసరుపెట్టిన ఎమ్మెల్యే గారి కుక్క!

ప్రేమగా చూసుకునే పెంపుడు జంతువులకు అనారోగ్యం వస్తే పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం అందరికీ తెలిసిందే. మరి అది ఎమ్మెల్యే గారి కుక్క. ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనగారు చూడలేకపోయారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఏమైందో చూడాలని ఆర్డరేశారు. కుదరదని చెప్పిన పాపానికి ఆసుపత్రి చీఫ్ పై బదిలీ వేటు వేయించాడు. వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ నిర్మల్ మజీ పెంపుడు కుక్కకు కాస్త జబ్బు చేసింది. తన కుక్కకు డయాలసిస్ చేయాలంటూ, ఎస్ఎస్ కేమ్ గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జూనియర్ డాక్టర్లు కుక్కకు డయాలసిస్ చేయడానికి సన్నద్ధం కాగా, ఆసుపత్రి డైరెక్టర్ గా, చీఫ్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ మిత్రా అంగీకరించలేదు. ఆపై ఆయనకు బదిలీ ఆదేశాలు అందాయి. ముప్పై సంవత్సరాలకు పైగా ఇక్కడే విధులు నిర్వరిస్తున్న తనపై ఆకస్మిక వేటు తనను అగౌరపరిచేదిగా ఉందని ప్రదీప్ వాపోతున్నాడు. ఈ ఘటనపై విమర్శలు తలెత్తగా, తొలుత కుక్కకు డయాలసిస్ చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన సదరు ఎమ్మెల్యే, ఆపై మాట మార్చి తనకు ఎటువంటి పెంపుడు కుక్క లేదంటూ చెబుతున్నారు.

More Telugu News