: అబూసలేంను పెళ్లి చేసుకుంటానంటూ కోర్టును ఆశ్రయించిన యువతి!
గ్యాంగ్ స్టర్ అబూసలేంను వివాహం చేసుకుంటానంటూ 26 ఏళ్ల ఓ యువతి ముంబయిలోని ప్రత్యేక టాడా కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేసింది. "సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ టాడా కోర్టులో ఆ మహిళ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసింది" అని ఆమె తరపు న్యాయవాది ఫర్హానా షా తెలిపారు. సలేం తనను వివాహం చేసుకున్నట్టు గతంలో ముంబయి సిటీ టాబ్లాయిడ్ ఓ వార్త ప్రచురించడంతో పోలీసులు తన గురించి విచారణ చేశారని సదరు మహిళ తన పిటిషన్ లో పేర్కొన్నట్టు న్యాయవాది వెల్లడించారు.
సలేంతో ఆమె ఉన్న ఫోటోను పలువురికి చూపించి వివాహం గురించి పోలీసులు అడిగారని, కానీ పెళ్లి కాలేదని తెలిసిందన్నారు. పోలీసుల దర్యాప్తుతో ఆమె క్యారెక్టర్ పై చెడు ప్రభావం పడిందని, ఇంకెవరినీ తను పెళ్లి చేసుకోలేదని, అందుకే సలేంనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో ప్రస్తుతం సలేం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
గతేడాది కోర్టు విచారణ నిమిత్తం లక్నో పోలీసులు సలేంను ట్రైన్ లో తీసుకువెళుతున్న సమయంలో ఫోన్ ద్వారా ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్టు ముంబయి టాబ్లాయిడ్ వార్త ప్రచురించింది. దానిని పరిశీలించిన టాడా కోర్టు ఈ విషయంపై విచారణ జరపాలంటూ థానే పోలీసులను ఆదేశించింది. అయితే సలేం మాత్రం తనకు పెళ్లి కాలేదని అప్పుడే కొట్టిపారేశాడు.